
వెనుకబడిన కులాల అభ్యున్నతికి కులగణన చేపట్టాలి
అల్లిపురం : సమాజంలో వెనుకబడిన కులాల అభ్యున్నతికి కులగణన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావాలన్నారు. అవసరమైతే చలో అమరావతికి సిద్ధం కావాలని కోరారు. తెలంగాణలో కులగణన నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో 143 బీసీ కులాలు ఉంటే 10–12 కులాలకు చెందినవారు మాత్రమే అభివృద్ధి చెందారన్నారు. మిగిలిన కులాలవారు ఇంకా వెనుకబడి ఉన్నారని తెలిపారు. బంగారు కుటుంబాల పేరుతో పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ధనికులను కోరుతోందని, వారి దయాదాక్షిణ్యాలపై పేదలు బతకాలా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఎర్ని శ్రీనివాసరావు, నగరాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగపిళ్ల అప్పలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, ఉత్తరాంధ్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.సుధాకర్, బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, వాడబలిజ సంక్షేమ సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం, బీసీ సంఘం నాయకురాలు డాక్టర్ బీసీఎస్ కల్యాణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సీపీఐ కార్యదర్శులతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్