
రహదారుల సమస్యలపై వినతులు
రంపచోడవరం: వై రామవరం మండలం దారగెడ్డ గ్రామంలో 300 మీటర్లు రెండు సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని పీసా ఉపాధ్యక్షుడు గోరగాలి లక్ష్మణరావు, దూడ కుశరాజులు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌కు సోమవారం అర్జీ అందజేశారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం 63 అర్జీలు వచ్చినట్లు పీవో తెలిపారు. దేవీపట్నం మండలం పోలవరం ముంపునకు గురైన ఇందుకూరు–2 ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో సత్యసాయి తాగునీటిని ఏర్పాటు చేయాలని, మూడు కిలోమీటర్లు వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని, శ్మశానవాటిక, ప్రహరీ ఏర్పాటు చేయాలని, దహన సంస్కారాలకు ఐరన్ దొడ్డి ఏర్పాటు చేయాలని తోకల కృష్ణ, తోకల పొట్టయయ, వీరచంద్రరెడ్డి తదితరులు కోరారు. సీహెచ్ గంగవరం నుంచి మునకలగెడ్డ గ్రామానికి మూడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని కోసు అచ్చిబాబు తదితరులు అర్జీ అందజేశారు.వై రామవరం ఎగువ ప్రాంతంలోని పాలగెడ్డ గ్రామం నుండి బొడ్డగండి గ్రామం వరకు 15 కిలోమీటర్లు సీసీ రహదారి ఏర్పాటు చేయాలని, 12 గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు నిర్మించాలని గిరిజనులు కోట అబ్బాయిరెడ్డి, నైని లచ్చిరెడ్డిలు అర్జీ అందజేశారు. రంపచోడవరం మండలం సోకులుగూడెం గ్రామంలోని 21 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని, చెలకవీధి నుంచి కాకవాడ వరకు మూడు కిలోమీటర్లు రోడ్డు పనులు ప్రారంభించాలని సర్పంచ్ కొమరం పండుదొర , ఎంపీటీసీ నర్రి పాపారావు ఆర్జీ అందజేశారు. ఏపీవో డీఎన్‌వీ రమణ, ఎస్‌డీసీ పీ అంబేడ్కర్, ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.