సన్నిహితుడే చంపేశాడు
గూడెంకొత్తవీధి: జిల్లాలోని అడ్డతీగల మండలం డి.కొత్తూరు గ్రామానికి చెందిన వ్యాపారి బొదిరెడ్డి వెంకటేశులు అలియాస్ కొత్తూరు వెంకటేశులు దారుణ హత్యకు గురయ్యారు. కొయ్యూరు సమీపంలోని బోదరాళ్ల ఘాట్ రోడ్డు అటవీ ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డి.కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న మృతుడు బొద్దిరెడ్డి వెంకటేశులు సీజనల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. సన్నిహితంగా ఉంటున్న ఏలేశ్వరంలోని గొల్లలమెట్ట ప్రాంతానికి చెందిన రాజా రమేష్, స్నేహితులు అతనిని కారులో విశాఖపట్నం జిల్లాలోని దసరా ఉత్సవాలకు తీసుకువెళ్లారు. అప్పటినుంచి వెంకటేశులు ఇంటికి రాకపోవడంతో బంధువులు ఏలేశ్వరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలావుండగా మృతుడు వెంకటేశులు వద్ద రూ.15 లక్షల విలువైన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉంది. దీనిపై ఆశపడిన సన్నిహితుడు రాజా రమేష్ ఈనెల రెండవ తేదీ దసరా పండగ రోజున కొయ్యూరు సమీప అటవీప్రాంతంలోని బొంతువలస ప్రాంతంలో అతనిని హతమార్చి మృతదేహాన్ని అక్కడ తుప్పల్లో వదిలి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి ఆందోళనకు గురైన రాజారమేష్ గంగవరం మండలం మోహనాపురం నుంచి వస్తూ అడ్డతీగల మండలం వేటమామిడి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కొంతమంది అతనిని అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయం ఏలేశ్వరం పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
బంగారం, నగదుకు ఆశపడి
వ్యాపారి దారుణ హత్య
బొంతువలస ప్రాంతంలో మృతదేహం వదిలి పరారీ
హత్యకేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఆత్మహత్యాయత్నం


