
ఆటో డ్రైవర్లకు ఆర్థిక తోడ్పాటు
పాడేరు : రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 4217 మంది ఆటో డ్రైవర్లకు రూ.6కోట్ల 32లక్షల 55వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిందన్నారు. అనంతరం చెక్కుల పంపిణీ చేశారు.
పాత బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు నిర్వహించిన ఆటో ర్యాలీలో ఆమెతో పాటు కలెక్టర్ దినేష్‌కుమార్, ఇతర అధికారులు కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యుడికి ఎంతో లబ్ధి చేకూరిందని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల భవనాలు లేని చోట కొత్త భవనాలు మంజూరు చేస్తున్నామని, పాడైన వాటికి మరమ్మతులు చేపడుతున్నామన్నారు.
హైడ్రో పవర్ పనులు తాత్కాలికంగా
నిలిపివేయండి
ఏజెన్సీలో చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై గిరిజనులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్‌ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. దీనిపై గిరిజనులతో పూర్తిగా చర్చించి వారు పూర్తిగా సమ్మతిస్తేనే ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్, సృజనాత్మకత, జానపద కళాల అకాడమి రాష్ట్ర చైర్మన్ గంగులయ్య, జిల్లా రవాణ అధికారి కేవీ ప్రకాష్ పాల్గొన్నారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
గుమ్మడి సంధ్యారాణి