
అటవీశాఖలో అక్రమార్కులు
● పట్టుకున్న టేకు విలువ తక్కువ చూపిన సిబ్బంది
● జరిమానా తక్కువ విధించడంతో అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు
● రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్..
మరో రూ.30 వేల ఫైన్ విధింపు
● అటవీశాఖలో కలకలం రేపుతున్న అవినీతి బాగోతం
నర్సీపట్నం: టేకు కలప పట్టివేతలో అటవీ సిబ్బంది ధనదాహం కలకలం రేపుతోంది. నర్సీపట్నంలో అటవీ సిబ్బంది అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విషయం అజ్ఞాత వ్యక్తి సమాచారంతో వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’కి లభించిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం గత నెల 17వ తేదీన కోటవురట్ల మండలం, యండపల్లి సమీపంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న టేకు కలపను రేంజర్ రాజేశ్వరరావు సమక్షంలో అటవీ సిబ్బంది పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి రేంజ్ కార్యాలయంలో ఉన్న కలప డిపోకు తరలించారు. మిల్లులో కోసిన దుంగలకు ఒక రేటు, చెక్కుడు దుంగలకు వేరే రేటు ఉంటుంది. పట్టుబడింది మిల్లులో కోసిన దుంగలైతే రికార్డులో చెక్కుడు దుంగలుగా చూపించారు. విలువ తక్కువ చూపి రూ.79,848 మాత్రమే అపరాధ రుసుం విధించారు. నిబంధనల ప్రకారం పట్టుకున్న కలప విలువకు ఐదింతర జరిమానా విధించాలి. ఈ వ్యవహారంలో రూ.50 వేల వరకు చేతులు మారినట్టు తెలిసింది. ఇదే విషయం ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర అటవీశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. పట్టుకున్న కలపను పరిశీలించి రూ.లక్షా 7 వేల అపరాధ రుసుం విధించారు. రూ.30 వేలకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ఎవరిపై వేటు పడుతుందోనని అటవీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. డీఎఫ్‌వో శామ్యూల్‌ను సంప్రదించగా ఈ విషయం తన దృష్టిలో ఉందని, సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు.