
వృత్తి సవాళ్లపై అవగాహన ఉండాలి
సబ్బవరం: వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతో పాటు, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే అంశాలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలని ఆర్‌జేడీ విజయభాస్కర్ శుక్రవారం తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డీఎస్సీ–2025లో ఎంపికై న నూతన ఉపాధ్యాయులందరికీ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ ఉమ్మడి జిల్లాకు చెందిన కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు అందజేయడంతో పాటు, వృత్తిపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ 8 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌జేడీ విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణను ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనిచేసే గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి. అప్పారావు నాయుడు, ఉప విద్యాశాఖాధికారి అప్పారావు, అకడమిక్ మానిటరింగ్ అధికారి కెజియా పాల్గొన్నారు.
మధురవాడ: కొత్తగా విధుల్లో చేరబోతున్న ఉపాధ్యాయులు తాము పొందుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ ఆర్‌జేడీ విజయభాస్కర్ సూచించారు. మధురవాడ ఐటీ సెజ్‌లో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం 8 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘ఇండక్షన్ ట్రైనింగ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని 360 మంది ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రేమకుమార్, భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎల్. సుధాకర్ పాల్గొన్నారు.