
ఆదికర్మయోగి అభియాన్‌తో గ్రామాల అభివృద్ధి
వై.రామవరం: మండలంలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనుల కోసం సర్వేచేసి, నివేదికలను సమర్పించే విధంగా తగినంత మంది అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఈప్రోగ్రాంను మండల ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఐటీడిఏ పీఓ స్మరణ్ రాజ్ మండల ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చవిటిదిబ్బలు సచివాలయంలో ఎంపీడీవో కె.బాపన్నదొర అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఐటీడిఏ పీవో స్మరణ్‌రాజ్ తోపాటు ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ముర్ల జోగిరెడ్డి, వలాల విశ్వమ్మ, ఎంపీటీసీ వీరమళ్ళ సుబ్బలక్ష్మి, సర్పంచ్ బచ్చలి చిన్నమ్ములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతు ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చవిటిదిబ్బలు పీహెచ్‌సీను తనిఖీ చేశారు. అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైధ్యాధికారులకు, సిబ్బందికి సలహాలు సూచనలిచ్చారు. తోటకూరపాలెం కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులున్న విషయంపై ఆరా తీశారు. మెనూ సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తోటకూరపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, పౌష్టికాహారం పంపిణీ తదితర విషయాలపై ఆరా తీశారు. లభ్దిదారులకు గృహ నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్ పి.వేణుగోపాల్, ఈఈ ఐ.శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్