
జీఎస్టీ తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించాలి
చింతపల్లి: గిరిజన రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తగ్గించిన జీస్టీపై అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వి.జయరాజ్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక వ్యవసాయ అగ్రిల్యాబ్‌లో చింతపల్లి, జీకే వీది మండలాల పశుసంవర్థకశాఖ వైద్యాధికారులు, వెటర్నరీ అసిస్టెంట్లు, సిబ్బందితో సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి రైతులకు అవసరమైన అన్ని వస్తువులపై 12 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించడంతో రైతులకు ఆర్థికంగా ఆదా అవుతుందన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గుదలతో విశాఖ డెయిరీ ఉత్పత్తుల్లో రోజుకు రూ.20 లక్షల ఆదా అవుతుందన్నారు. పశుసంపద ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న బయో గ్యాస్ లబ్ధిదారులకు 18 నుంచి ఐదు శాతానికి తగ్గిందన్నారు. మందులు, ఇన్సూరెన్స్‌లపై పూర్తిగా జీఎస్టీ తగ్గిందన్నారు.
● జిల్లాలో సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లో ఉన్నటువంటి 5,326 మంది మహిళలకు పాడి పశువుల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వి.జయరాజ్ తెలిపారు.డ్వాక్రా మహిళలకు అవసరమైన గేదెలు, ఎద్దులు, గొర్రెలు మేకలు, కోళ్లు తదితర యూనిట్లకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. మహిళలు కోరుకున్న యూనిట్లకు సంబంధించి నేరుగా పశుసంవర్థకశాఖ,వెలుగు, బ్యాంకు అధికారుల సమక్షంలో మైదాన ప్రాంత మార్కెట్‌లో నేరుగా కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. వీరికి బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తారన్నారు. మండలాలు వారీగా లబ్ధిదారులను గుర్తించామన్నారు. వీరికి త్వరలోనే యూనిట్ల పంపిణీ చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీ చంద్రశేఖర్, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, వైద్యాదికారులు రమేష్, సౌజన్యదేవి సాలిని తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి జయరాజ్