
తగ్గిన వరద.. కొనసాగుతున్న రాకపోకలు
చింతూరు: ఆరు రోజులపాటు విలీన మండలాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గోదావరి, శబరినదుల వరద ఎట్టకేలకు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికంటే దిగువకు చేరింది. వరదనీరు రహదారులను వీడడంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. చింతూరు మండలంలో సోకిలేరువాగు వరదనీరు ఇంకా స్వల్పంగా వంతెనపై నిలిచి ఉంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు పడవపై రాకపోకలు కొనసాగగా నీరు మరింత తగ్గడంతో సాయంత్రం నుంచి కాలినడకన రాకపోకలు సాగుతున్నాయి. ఇక్కడ శనివారం ఉదయానికి పూర్తిస్థాయిలో వరదనీరు తొలగే అవకాశం ఉంది. మరోవైపు కుయిగూరువాగు వరద జాతీయ రహదారి పైనుండి పూర్తిగా తొలగడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు యధావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల వరదనీరు కూడా తగ్గింది.

తగ్గిన వరద.. కొనసాగుతున్న రాకపోకలు