
నిలిపివేసిన సర్వీసులు.. ప్రయాణికుల అగచాట్లు
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా అంతర్రాష్ట్ర ప్రయాణికులు దసరా తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులు గురువారంతో ముగిశాయి.దీంతో ఉద్యోగులు.పాఠశాల విద్యార్థులు పండగ అనంతరం శుక్రవారం పాఠశాలలు ప్రారంభించారు. గ్రామాల నుంచి తిరుగు ప్రయాణానికి సంసిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి సీలేరు రావలసిన నైట్ బస్ సర్వీసును రద్దు చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సీలేరు నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన బస్సు లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అలాగే నర్సీపట్నం నుంచి సీలేరు రావలసిన రెండు బస్సులు కూడా శుక్రవారం రాకపోవడంతో సీలేరు బస్ స్టాండ్ వద్ద గంటలు తరబడి ప్రయాణికులు వేచి చూసి రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు. ప్రకటన లేకుండా బస్సులు ఎలా రద్దు చేస్తారు అని ప్రశ్నించారు. దీంతో సీలేరు నుంచి చింతపల్లి నర్సీపట్నం, డొంకరాయి మోతుగూడెం భద్రాచలం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రాత్రిపూట అంతర్రాష్ట్ర రహదారిలో తిరిగే ఒకే బస్సు సర్వీసు ఉండడం, అది కూడా ఖాళీ లేకపోవడం వారం రోజులు ముందుగానే రిజర్వేషన్ అయిపోవడంతో ప్రయాణికులు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్సులను సకాలంలో అన్ని సర్వీసులు అందుబాటులో ఉండేలా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మొరాయించిన బస్సు...ప్రయాణికుల పాట్లు
నర్సీపట్నం నుంచి సీలేరు వస్తున్న దారలమ్మ ఘాట్‌రోడ్డులో బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి, గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. బస్సులో సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయినట్టు పలువురు తెలిపారు. ఘాట్‌రోడ్డు తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని కోరుతున్నారు.
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

నిలిపివేసిన సర్వీసులు.. ప్రయాణికుల అగచాట్లు

నిలిపివేసిన సర్వీసులు.. ప్రయాణికుల అగచాట్లు