
సబ్‌కలెక్టర్ ఉత్తర్వులపై రైతుల హర్షం
ఎటపాక: ప్రభుత్వ, ఇతరుల భూములు ఆక్రమించడం, స్వాధీనానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరమని సబ్‌కలెక్టర్ శుభంనోఖ్వాల్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని నందిగామలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. నందిగామ,మురుమూరు ప్రాంతాల్లో గతంలో పోలవరం భూనష్టపరిహారం పొందిన భూముల్లో ఇటీవల కొందరు జెండాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిపారు. అయితే ఈవిషయంపై సదరు భూ యజమానులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ దినేష్‌కుమార్‌ను ఆశ్రయించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో చింతూరు సబ్‌కలెక్టర్ తగు ఉత్తర్వులు జారీ చేసినట్లు రైతులు తెలిపారు. 2013 భూసేకరణ చట్టప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నష్టపోతున్న భూములకు పరిహారం పొందిన సదరు రైతులే సాగుచేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం సేకరించిన భూముల రైతులకు అన్ని రకాల పరిహారం ఇచ్చి ఈప్రాంతం నుంచి తరలించేవరకు అట్టి భూములు పూర్వ యజమానుల స్వాధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లోకి ఇతరులు ప్రవేశించడం, ఆక్రమించడం చట్టరీత్య నేరమని ఉత్తర్వుల్లో తెలిపారని రైతులు వివరించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు దొంతు మంగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ రాజేష్, రైతులు చండ్ర రఘు, పెనుబల్లి సాయిబాబు, పులుసు కొండలరావు, సీతయ్య, వెంకన్న, గొడపర్తి చిననాగయ్య, వాసు, సత్యప్రసాద్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మండల ఉపాధ్యక్షుడు మంగేశ్వరరావు