
సర్కారు బడులు వెలవెల
● శనివారం 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు
ఆదిలాబాద్‌టౌన్: దసరా సెలవులు ముగిసినప్పటికీ విద్యార్థులు బడిబాట పట్టలేదు. దీంతో జిల్లాలోని సర్కారు బడులు శనివారం వెలవెలబోయాయి. 13 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే కేవలం 15 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. బతుకమ్మ పండగ, బంధువుల ఇంటికివెళ్లడం, కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండడంతో బడికి రానట్టుగా తెలుస్తోంది. పాఠశాలల్లో ఉండాల్సిన పిల్లలు ఆరుబయట ఆడుకుంటూ కనిపించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా కనిపించింది. కాగా, ఉపాధ్యాయుల హాజరు మాత్రం 98 శాతం నమోదైనట్లు విద్యా శాఖాధికారులు తెలిపారు.