
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. పెండింగ్ కమీషన్ డబ్బులను విడుదల చేయాలని సోమవారం రేషన్ డీలర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బతుకమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. వారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశపడ్డ డీలర్లను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో డీలర్ల సమస్యలను ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానిచ్చారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవికి డీలర్లు అందజేశారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ పాల్గొన్నారు.