
మహా పోచమ్మకు నీరా‘జనం’
వైభవంగా ఆభరణాల శోభాయాత్ర అడుగడుగునా హారతి పట్టిన జనం దర్శించుకుని పులకించిన భక్తులు కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం ముగిసిన ‘అడెల్లి’ గంగనీళ్ల జాతర
సారంగపూర్/దిలావర్‌పూర్: జిల్లాలో అత్యంత ప్రా శస్త్యం గల అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర మహోత్సవం ఆదివారం ముగిసింది. శనివారం దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రా మంలోగల గో దావరి నదికి అశేష భక్తజన సందోహం మధ్య అమ్మవారి ఆభరణాల శోభా యాత్ర చేరింది. ఆది వారం తెల్లవారుజామున గోదావరి నీటితో భక్తులు ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం కాలినడకన ఆయా గ్రామాల మీదుగా తిరిగి అమ్మవారి ఆలయానికి ఆభరణాలు చేర్చారు. అమ్మవారికి నగలు అంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాత ర ముగిసింది.
దారి పొడవునా ‘అమ్మ’ నామస్మరణ
అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాల ఊరేగింపు శోభా యాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి దిలావర్‌పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్‌పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచ మ్మ ఆలయం వరకు కొనసాగింది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు శనివారం రాత్రంతా పోచమ్మ ఆలయ పరిసరాల్లో అమ్మవారి నామస్మరణ చేస్తూ జాగరణలో పాల్గొన్నారు. ‘గంగ నీకు శరణమే.. ఘనమైన పూజలే..’ ‘ఉయ్యాలో ఉయ్యాలో.. ఊరూవాడ జంపాలో..’ ‘పోచమ్మ తల్లి చల్లంగా చూడ మ్మో..’ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకుంటూ ఆటాపాటలతో ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకుని గంగనీళ్ల జాతరకు వచ్చిన భక్తులు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. సాంగ్వి ఆలయం నుంచి ఉదయం ప్రారంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగు పయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్‌పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు.
జాలుక దండతో ఘనస్వాగతం
దిలావర్‌పూర్ గ్రామానికి ఆభరణాల శోభాయాత్ర చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీ పూలతోరణం) తో స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహిహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాట పిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలు, నృత్యాల మధ్య ముందుకుసాగారు. దారిపొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ, కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు. యాకర్‌పెల్లి గ్రామ గంగపుత్రులు సన్నని వలతో గొడుగుపట్టి ఆభరణాలను గ్రామ పొలిమేరల వరకు సాగనంపారు. ఆభరణాల శోభాయాత్ర, జాతరలో పాల్గొన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏఎస్పీ రాజేశ్ మీనా, నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్‌పూర్ ఎస్సై రవీందర్‌తో పాటు పలువురు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
గంగనీళ్ల జాతర నేపథ్యంలో అడెల్లి మహాపోచమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబా ద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబా ద్, మెదక్, మహారాష్ట్రల నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తీర్థప్రసాదాలు అందించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ యంత్రాంగం, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందికి, ఆయా గ్రామాల ప్రజలకు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో రమేశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.