
సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుమెంబర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏ గ్రామం, వార్డు ఏయే సామాజిక వర్గానికి కేటాయించబడిందనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం మధ్యాహ్నం జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆదివారం వేకువజామున 3గంటల వరకు కొనసాగింది. జిల్లా పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ఎంపీడీవోలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కలెక్టర్ రాజర్షి షా ఆమోదంతో రిజర్వేషన్ల గెజిట్ సైతం ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల మాదిరిగానే పంచాయతీ రిజర్వేషన్లు సైతం భిన్నంగా రావడంతో పలు గ్రామాల్లో పోటీ చేద్దామనుకునే అశావహులకు నిరాశే ఎదురుకానుంది. కాగా సగం సీట్లు అతివలకే కేటాయించడంతో పంచాయతీల్లో వారి ప్రాతినిధ్యం పెరగనుంది. రిజర్వేషన్లు స్పష్టం కావడంతో పల్లె రాజకీయం వేడెక్కనుంది. మరోవైపు పోటీకి సై అంటున్న వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాలో..
జిల్లాలో 20 గ్రామీణ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 251 జీపీలు ఏజెన్సీ పరిధిలోని షెడ్యూల్డ్ ఏరియాలోనే ఉండగా.. మరో 15 పంచాయతీల్లో వందశాతం ఎస్టీ జనాభానే ఉంది. దీంతో ఆయా పంచాయతీలన్నింటినీ ఎస్టీలకే రిజర్వ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో గల మరో 207 పంచాయతీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆన్ రిజర్వ్‌డ్‌గా కేటాయించారు. ఇందులో ఎస్టీలకు 47, ఎస్సీలకు 31, బీసీలకు 86 కేటాయించగా, మరో 43 పంచాయతీలను ఆన్ రిజర్వ్‌డ్ (జనరల్)గా ఖరారు చేశారు. మొత్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 234 జీపీలను మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ స్థానాల్లోనూ వీరు పోటీ చేసే అవకాశం ఉండటంతో పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశముంది. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటతో పాటు జిల్లాలోని 3,870 వార్డు స్థానాలకు గాను ఎంపీడీవోల ఆధ్వర్యంలో రిజర్వేషన్లను పూర్తి చేశారు. వీటిల్లోనూ సగం స్థానాలను మహిళలకు
కేటాయించారు.
సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపు వివరాలిలా...
(షెడ్యూల్డ్ ఏరియాలో..)
మహిళలకు : 124 జనరల్ : 127
వందశాతం ఎస్టీ జనాభా
కలిగిన పంచాయతీల్లో..
మహిళలు : 07 జనరల్ : 08
నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ...
ఎస్టీలు ఎస్సీలు బీసీలు అన్
రిజర్వ్‌డ్
మహిళలు 24 17 41 21
జనరల్ 23 14 45 22