
మొక్కలు తెప్పించారు.. పంపిణీ మరిచారు
● బల్దియా అధికారుల నిర్వాకం
కైలాస్‌నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమంపై బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మీడియన్ ప్లాంటేషన్, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఇప్పటికే లక్ష్యం మేర మొక్కలు నాటడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. తాజాగా పట్టణంలోని ప్రతీ ఇంటి ఆవరణలో నాటేందుకు అవసరమైన జామ, మల్లె, నందివర్ధనం, చక్రంపూలు వంటి వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను తెప్పించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నర్సరీ నుంచి సుమారు 40వేల వరకు ఆయా రకాల మొక్కలను సరఫరా చేశాడు. ఇటీవల జిల్లాకు తీసుకువచ్చిన ఈ మొక్కలను మున్సిపాలిటీకి సంబంధించిన బంగారుగూడలోని డంపింగ్‌యార్డులో నిల్వ చేశారు. పట్టణానికి చేరి 20 రోజులవుతున్నా ప్రజలకు అందించే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిర్వహణ లోపంతో పలు మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వాటిని నాటేందుకు అనువైన పరిస్థితులున్నాయి. కాగా, ఈ విషయమై బల్దియా డీఈఈ కార్తీక్‌ను సంప్రదించగా.. ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టామని పేర్కొనడం గమనార్హం.