
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సీనియర్ నాయకులు లంకా రాఘవులు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం నిర్వహించిన సమావేశలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు దానిని అమోదించకుండా నిర్లక్ష్యం చేయడం బీసీలను బీజేపీ అవమానించడమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్, రాష్ట్ర నాయకులు శోభన్, రమేశ్, జిల్లా కార్యదర్శి మల్లేశ్, కార్యదర్శివర్గ సభ్యులు రాఘవులు, సచిన్, కిరణ్, దత్తాత్రి, మంజుల, సురేందర్, ఆశన్న, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.
పిప్పల్‌కోటి నిర్వాసితులను ఆదుకోవాలి
భీంపూర్: పిప్పల్ కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని జాన్‌వెస్లీ కోరారు. శనివారం పిప్పల్‌కోటి నిర్వాసితులను కలిసి ఆయకట్టను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రిజర్వాయర్ కోసం దాదాపు 1200 ఎకరాల సాగుభూమిని రైతులు అందిస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదన్నారు. తక్షణమే నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత ధరకు మూడింతలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందులో నిర్వాసితుల సంఘం కన్వీనర్ నసిరుద్దీన్, కోకన్వీనర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.