
కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్‌టౌన్: కిసాన్ కపస్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో శనివారం జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ ఈ యాప్ ద్వారానే కొనుగోళ్లు చేపడుతుందన్నారు. పంట అమ్మకానికి తేదీని ఖరారు చేసుకోవాలని, యాప్‌లో బుకింగ్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా అవే తేదీల్లో విక్రయించాల్సి ఉంటుందన్నారు. రైతు వేదికల్లో ఏఈవోలు స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌స్వామి, మార్కెటింగ్ ఏడీ గజానంద్ మాట్లాడారు . జిల్లాలో ఈ ఏడాది 4.28లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందన్నారు. 30లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేసినట్లుగా తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మార్కెట్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 20వ తర్వాత పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 34 జిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో సీసీఐ ద్వారా 25లక్షల క్వింటాళ్ల పత్తిని, ప్రైవేట్ ద్వారా 2.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 6న కిసాన్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో టెక్నికల్ ఏవోలు శివకుమార్, విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.