
అంతటా ‘స్థానిక’ ముచ్చటే..
ఆశావహుల్లో వీడని టెన్షన్ జెడ్పీలో పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం రిజర్వేషన్ల ప్రకటనపై సర్వత్రా ఆసక్తి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం ఏ నలుగురు ఓ చోట కలిసినా రిజర్వేషన్ల ముచ్చటే వినిపిస్తోంది. సర్పంచ్, వార్డుమెంబర్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల వరకు రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారై ఉండవచ్చనే దానిపైనే చర్చించుకుంటున్నారు. అధికారికంగా వివరాలు ప్రకటించనప్పటికీ ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. ఇక జెడ్పీపరంగా మెజార్టీ స్థానాలు ఎస్టీలు, బీసీలకు రిజర్వ్ కావడంతో జనరల్ స్థానాల్లో పోటీ చేద్దామని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురుకానుంది. ఆన్ రిజర్వుడ్ స్థానాలు రెండే ఉండడంతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న తాజా మాజీల అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో బీసీల ప్రాతినిధ్యం పెరగనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అధికారిక ప్రకటనపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బీసీలకు పెరగనున్న ప్రాతినిధ్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే ఖరారు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. అలాగే జిల్లాలో జెడ్పీ పరంగా 20 మండలాలుండగా 8 ఎస్టీలకు, 8బీసీలకు, రెండు ఎస్సీలకు, రెండు ఆన్ రిజర్వ్‌డ్‌గా కేటాయించింది. దీంతో జెడ్పీలో బీసీల ప్రాతినిధ్యం పెరగనుంది. అయితే ఈసారి జెడ్పీటీసీగా ఆన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో బరిలో నిలువాలని అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన పలువురు బడా నాయకులు భావించారు. అయితే రిజర్వేషన్లు తారుమారు కావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. వారితో పాటు తాజా మాజీలు సైతం ఆయా స్థానాల్లో మరోసారి పోటీ చేయాలని భావించారు. దీంతో వారికి కూడా భంగపాటు తప్పేలా కనిపించడం లేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక జిల్లాలో 473 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 251 సర్పంచ్ స్థానాలు నోటిఫైడ్ ఏరియాలోనే ఉండటంతో వాటిని తప్పనిసరిగా ఎస్టీలకు కేటాయించనున్నారు. మరో 15 పంచాయతీల్లో వందశాతం ఎస్టీ జనాభానే ఉండటంతో అక్కడ వారికే ప్రాతినిధ్యం దక్కనుంది. మిగిలిన 207 సర్పంచ్ స్థానాల్లో వివిధ కేటగిరిల వారికి రిజర్వు చేయాల్సి ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో ఏ స్థానం ఎవరికి కేటాయించబడిందనేది తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని తెలుసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వివరాలు బయటకు వెల్లడి కాకపోవడంతో టెన్షన్‌కు గురవుతున్నారు. అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం లేదు.
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయాలని యంత్రాగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం రెండు రోజులుగా కసరత్తు చేపట్టింది. స్థానాల వారీగా జనాభా ప్రాతిపదికన రొటేషన్ విధానం అనుసరిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే వాటి వివరాలు బయటకు వెల్లడించకపోవడంతో ఏ స్థానం ఎవరికి రిజర్వు అయిందనే విషయం తెలియడం లేదు. పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయా రచ్చబండల వద్ద తమ సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ ఏమై ఉంటుందనే దానిపై చర్చించుకుంటున్నారు. ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు.