
ఎకరాకు రూ.50 లక్షలిస్తేనే భూములిస్తాం..
కై లాస్‌నగర్: ఎకరాకు రూ.50లక్షలు చెల్లిస్తేనే తమ భూములు అప్పగిస్తామని రామాయి సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోతున్న రైతులు తేల్చిచెప్పారు. ఎకరాకు రూ.8.29లక్షల చొప్పున చెల్లించేలా ధర నిర్ణయిస్తూ ఆర్డీవో ఇటీవల 38 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వాసిత రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఆర్డీవో స్రవంతి బుధవారం సమావేశం నిర్వహించారు. తొలుత ఫ్యాక్టరీ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. పనికి రా ని భూములకు చెల్లించే మొత్తాన్నే మూడు పంటలు పండించే భూములకు చెల్లిస్తామనడం సరికాదని రైతులు పేర్కొన్నారు. తామంతా సన్న, చిన్నకారు రైతులమేనని, ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు. వాటిని తక్కువ ధరకు తీసుకుంటే తమకు కనీసం ప్లాటు కూడా రాదని తామెలా జీవించాలని ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెబుతున్నందున తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే భూమికి బదులు భూమి కొనివ్వాలని, లేకుంటే ఎకరాకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఆర్డీవో రైతులకు న్యాయం చేసేలా చూడాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. ఫ్యాక్టరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటికే 630 ఎకరాల భూమిని సేకరించామన్నారు. దసరా తర్వాత పనులు ప్రారంభిస్తామని, రైతులు సహకరించాలని కోరారు. కాగా, అంతకుముందు రైతులు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీజీఎం ఆది నారాయణస్వామి, ఆమరేందర్, జీఎం శ్రీనివాసరావు, ఏజీఎం సైదులు, ఆకుల రాంరెడ్డి, మాజీ ఎంపీపీ గండ్రత్ రమేశ్, బండి దత్తాత్రీ తదితరులు పాల్గొన్నారు.