
గునుగు పూలతో ఉపాధి
సారంగపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని నాగునూరు గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు ఏటా బతుకమ్మ పండుగకు గునుగుపూలు సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలానికి వచ్చి గునుగుపూలు సేకరిస్తున్నారు. ప్రత్యేక వాహనంలో వాటిని తమ గ్రామానికి తీసుకెళ్లి బతుకమ్మ పేర్చేందుకు అనువుగా కట్ చేస్తారు. ఆతర్వాత రంగులు అద్దుతారు. వాటితో బతుకమ్మలను తయారు చేసి రూ.500ల నుంచి రూ.600లకు ఒకటి చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
గునుగు పూలను తీసుకెళ్తున్న మహిళలు
మూడేళ్ల నుంచి వస్తున్నాం..
మా గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో మహిళలు బతుకమ్మ పండుగ సీజన్‌లో గునుగు పూలు కొనుగోలు చేసేవారు. అది గమనించిన నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఈవిషయాన్ని తోటి మహిళలకు వివరించి వారి సహకారంతో గునుగు లభ్యమయ్యే ప్రాంతాలపై ఆరాతీశాం. అప్పుడే నిర్మల్ జిల్లాలో ఉండే మా బంధువుల ద్వారా సారంగాపూర్‌లో లభ్యమవుతుందని తెలిసింది. అందుకే మూడేళ్లుగా ఇక్కడికి వచ్చి గునుగుపూలు సేకరిస్తున్నాం.
– లక్ష్మి, నాగునూరు, జగిత్యాల
ఆదాయమార్గంగా..
బతుకమ్మ సీజన్ రాగానే వ్యవసాయ కూలీ పనులు మానేసి గునుగు పూల సేకరణ ఆదాయమార్గంగా ఎంచుకున్నాం. గునుగు సేకరించి ఇళ్లకు వెళ్లాక అంతా కలిసి ఒకచోట చేరి బతుకమ్మ తయారీకి అనుగువుగా కట్‌చేస్తాం. రంగులు అద్ది జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తాం.
– గంగవ్వ, నాగునూరు, జగిత్యాల
డిమాండ్ ఎక్కువే
మా ప్రాంతంలో గునుగు లభ్యత చాలా తక్కువ. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో గునుగు లభ్యమయ్యే ప్రాంతాలను ఎంచుకుని అక్కడికి వెళ్లి గునుగు పూలు సేకరిస్తున్నాం. బతుకమ్మ మా బతుకులకు ఉపాధి మార్గం చూపడం చాలా సంతోషంగా ఉంది.
– జంగిలి రాజవ్వ, నాగునూరు, జగిత్యాల

గునుగు పూలతో ఉపాధి

గునుగు పూలతో ఉపాధి

గునుగు పూలతో ఉపాధి