
ఆశలు ఆవిరి!
ఇచ్చోడ: పుడమి తల్లిని నమ్ముకున్న రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఒడిదుడుకులతో ప్రారంభమైన ఖరీఫ్ సాగు ముందుకు సాగడంలేదు. పెట్టుబడికి చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారి అన్నదాతలపై ఆర్థికభారం మరింత పెరగనుంది. జిల్లాలో తీవ్ర అతివృష్టితో పత్తి పంటలో ఎదుగుదల నిలిచిపోయింది. నెలన్నర నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పూత, కాత ఆశించిన స్థాయిలో రాలేదు. గత జూన్‌లో విత్తనాలు వేసే ముందు వర్షాలు కొంత ఆశించిన స్థాయిలో ఉన్నా మొక్కలు పెరి గే సమయంలో ఆగస్టు నుంచి వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఒక్కరోజూ విరామం లేకుండా 50 రోజులుగా కురుస్తూనే ఉండగా పంట ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఇప్పటివరకు చెట్టుకు 30 నుంచి 40 వరకు కాయలు కాశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 10 కాయలు కూడా లేక దిగుబడుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం
ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై వరకు సాధారణానికి పరిమితమై, ఆగస్టు నుంచి సెప్టెంబర్ 12వరకు 1215.3 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 33శాతం అధికం. ఇచ్చోడ, సిరికొండ, బజార్‌హత్నూర్, తలమడుగు, మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, గుడిహత్నూర్, బేల, జైనాథ్, సాత్నాల, నేరడిగొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 12మండలాల్లో సాధారణం కంటే 47 నుంచి 67 శాతం అధికంగా వర్షం కురిసింది.
పెరిగిన పెట్టుబడులు
పత్తి విత్తుకున్న నుంచి 180రోజులలోపు పంట గడు వు ముగుస్తుంది. విత్తుకున్న నాటి నుంచి 120 రోజుల వరకు ఎదుగుదల, కాత, పూత దశకు చేరుకుంటుంది. 120 రోజుల పాటు పత్తిని ఏపుగా పెంచడంతో పాటు కాత, పూత కోసం రైతులు ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేస్తుంటారు. దా దాపు నాలుగు నుంచి ఐదుసార్లు ఎరువులు వేస్తా రు. కానీ, ఈ ఏడాది గత 50రోజులుగా నిరంతరంకురుస్తున్న వర్షాలతో ఎరువులు, పురుగు మందుల వాడకం కూడా పెరిగిపోయింది. దీంతో ఏడాది పత్తి పంట సాగుకు పెట్టుబడులు పెరిగిపోగా దిగుబడులు మాత్రం ఘననీయంగా తగ్గిపోయే అవకాశముండగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగుబడులు తగ్గవచ్చు
నెలరోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పత్తి దిగుబడులపై ప్రభావం పడనుంది. నిత్యం వాన కురుస్తుండడతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. వర్షాలు తగ్గుముఖం పడితే కొంత కాత, పూత పెరగనుంది. అయినా ఈసారి దిగుబడులు తగ్గే అవకాశముంది.
– రాజశేఖర్,
ఏరువాక సీనియర్ శాస్త్రవేత్త, ఆదిలాబాద్