
సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
నస్పూర్: పట్టణ పరి ధిలోని సీసీసీ శ్రీరామ్‌నగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు సీర్ల శ్రీనివాస్ (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనాగార్జున కాలనీకి చెందిన శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్‌కే–7 గనిలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మిడిల్ షిఫ్ట్ విధులు నిిర్వహించి సీసీసీ కార్నర్ వద్ద గల శ్రీరాంనగర్‌లోని ఆయన సొంత ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికుడు లెంకంటి సురేందర్ వెంటనే శ్రీనివాస్ తండ్రి సీర్ల నర్సయ్యకు సమాచారం ఇచ్చాడు. నర్సయ్య ఇంటికి వెళ్లి చూడగా శ్రీనివాస్ కాలిన గాయాలతో కిందపడి ఉన్నా డు. అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.