కోర్టుకు చేరిన లక్ష్మీపేట ఊచకోత కేసు
ముగిసిన 34 నెలల సుదీర్ఘ దర్యాప్తు
24 నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభం
80 మంది నిందితులకు సమన్లు జారీ
గ్రామంలో పటిష్ట
బందోబస్తు ఏర్పాట్లు
వంగర : రాష్ట్ర, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లక్ష్మీపేట దళితుల ఊచకోత కేసు విచారణ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం లక్ష్మీపేట గ్రామంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 24న విచారణ ప్రారంభం కానుండగా, దానికి హాజరు కావాలని కేసులో నిందితులకు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. విచారణ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో బీసీలు, దళితుల మధ్య నెలకొన్న కక్షల నేపథ్యంలో 2012 జూన్ 12న జరిగిన దాడుల్లో ఐదుగురు దళితులు మృతి చెందగా, మరో 19 మంది క్షతగాత్రులయ్యారు.
ఊచకోత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపడం, దళిత, ఇతర ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, సంఘటన జరిగిన లక్ష్మీపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని పట్టుబట్టాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించి, అదనపు జిల్లా సెషన్స్, ప్రత్యేక న్యాయస్థానాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు భవన నిర్మాణాలు చేపట్టిన అనంతరం వాటిని 2014లో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి ప్రారంభించారు. మరోవైపు కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సీఐడీ విభాగం చురుగ్గా దర్యాప్తు పూర్తి చేసింది. దాంతో ఘటన జరిగిన సుమారు 34 నెలల తర్వాత కోర్టులో కేసు విచారణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానంలో జిల్లా జడ్జి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు విచారణ జరగనుందని పోలీసువర్గాల ద్వారా తెలిసింది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే 80 మంది నిందితులకు పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు ఇరువర్గాలు హాజరయ్యే అవకాశమున్నందున ఉద్రిక్తతలు రేగకుండా గ్రామంలో, కోర్టు ఆవరణలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం గ్రామంలో 50 మంది ప్రత్యేక పోలీసులుండగా మరో 100 మంది పోలీసులను లక్ష్మీపేటకు పంపనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. విచారణ కూడా శాంతియుత వాతావరణంలో జరుగుతుందని స్థానికులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.