తెలుగు జగతికి వీరుడు

NTR on 21st death anniversary special - Sakshi

నేడు ఎన్టీఆర్‌ వర్థంతి

‘ఛోడ్‌ గయే బాలమ్‌’... అని రాజ్‌కపూర్‌ పియానో ముందు కూచుని విషాదంగా పాడుకుంటున్నప్పుడు, ‘టూటే హుయే ఖ్వాబోనే’... అని దిలీప్‌ కుమార్‌ ప్రియురాలిని తలుచుకుని రోదిస్తున్నప్పుడు, ‘తూ కహా యే బతా’... అని దేవ్‌ ఆనంద్‌ వీధులు పట్టుకుని తిరుగుతున్నప్పుడు ‘కలవరమాయే మదిలో’ అని నీటి గుమ్మటాల దగ్గర నిలబడి పాడుకోవడంతోటే ఆగిపోకుండా ఆ ప్రేమను నిజం చేసుకోవడానికి కత్తి పట్టుకుని కారడవులకు పయనమైన హీరో ఎన్‌.టి. రామారావు.

ఒక జాతి వీరత్వం కలిగి ఉండాలని, వీర స్వభావంతో ముందుకు సాగాలని, జాతి చెప్పుకోవడానికి ఒక వీరుడు ఉండాలని, అది వెండితెర మీద అయినా సరే, ఒక ఇమేజ్‌ను నిలబెట్టగలిగిన హీరో ఎన్‌.టి.రామారావు. స్త్రీలను ప్రేమించడం, కౌటుంబిక జీవితంలోని కష్టనష్టాలను భరించడం, అనుబంధాలను నిలబెట్టుకోవడం... ఇవన్నీ పురుషుడి జీవితంలో ఒక భాగమే కాని పురుష జన్మకు సార్థకత ఘనకార్యాలు చేయడమేనని సినిమా మీడియమ్‌ ద్వారా పదే పదే చెప్పిన హీరో ఎన్‌.టి.రామారావు.

ఉత్తరాదికి ఇలాంటి ఇమేజ్‌ ఇచ్చే హీరో ఏర్పడడానికి అమితాబ్‌ బచ్చన్‌ వచ్చే దాకా సమయం పట్టింది. కాని దక్షిణాదిన మూతి మీద ఎప్పుడూ మీసం ఉండేలా చూసుకునే ద్రవిడ జాతి ప్రతీకగా, ధీరోదాత్తతకు, పౌరుషానికి చిహ్నంగా తమిళనాట ఎం.జి.ఆర్, కన్నడ సీమన రాజ్‌ కుమార్, తెలుగులో ఎన్‌.టి.ఆర్‌ నిలబడ్డారు. సినిమాను కమర్షియల్‌ కళ అని భావించినట్టయితే అది నీరసపడిపోకుండా, శుష్కమైన పనులతో నిండిపోకుండా, దుర్బల దీనావస్థలకు పరిమితం కాకుండా కాపాడిన త్రయం ఈ ముగ్గురు.

వీరిలో తెలుగువారి మేటి ఎన్‌.టి. రామారావు. దేవతల స్థానంలో దేవుళ్లు ముందు వరుసలో నిలిచి దైవత్వానికి పురుష స్వభావం స్థిరపడ్డాక ఆ సంస్కృతికి తెలుగులో తొలి ప్రతీక అయినవాడు ఎన్‌.టి.రామారావు. రాముడుగా అతడు రావణుడిని సంహరించాడు. కృష్ణుడిగా అతడు కురుక్షేత్రాన్ని నడిపించాడు. విష్ణువుగా చక్రం తిప్పాడు. శివుడుగా చెడును లయించాడు. తెలుగువారి పురాణ పురుషుడు ఎన్‌.టి.ఆర్‌. తెలుగు జానపదులు కలలుగన్న కోరమీసం రాకుమారుడు కూడా ఎన్‌.టి.ఆరే. అతడు చిక్కడు. అతడు అగ్గిపిడుగు.

అతడే రాబిన్‌ హుడ్‌ బందిపోటు. అరేబియన్‌ గాథలకు అతడే ఆలీబాబా. అతడే కదా బాగ్దాద్‌ గజదొంగ. చరిత్రలోకి టైమ్‌ ట్రావెల్‌ చేయించి తెలుగువారిని భువనవిజయంలో ఆశీనులను చేయించిన కృష్ణదేవరాయలు అతడే. చంద్రగుప్తుడు అతడే. అశోకుడూ అతడే. భక్తి ఉద్యమంలోకి నడిపించగలిగిన పాండురంగడు అతడే. సిద్ధత్వంలోకి తీసుకెళ్లగలిగిన బ్రహ్మంగారు అతడే. ద్రవిడులకు ఒక ఆత్మ, ఆంతరాత్మ ఉందని నిరూపించి శూద్రుల దృష్టి కోణం నుంచి రావణుణ్ణి, కర్ణుణ్ణి మానవీయమూర్తులను చేసింది కూడా అతడే.

ఒక భుజాన వీరత్వం కలిగినా ఒక భుజాన వినోదాన్ని నింపుకుని బీదా బిక్కీ జనాలకు మూడు గంటల పాటు వారి కష్టాలను మరిచిపోగలిగేలా చేసినవాడు ఎన్‌.టి.రామారావు. వారి అమాయకమైన కేరింతల కోసం శ్రమించినవాడు ఎన్‌.టి.రామారావు. శ్రమజీవుల చెమట తుడిచిన చేతులు అతడివి. ఏనుగులెక్కి ఊడలను పట్టుకుని ఊగితే అతడు అడవి రాముడు. తుపాకి పట్టుకుని వేటకు బయల్దేరితే వేటగాడు. ఖాకీ యూనిఫామ్‌ తొడుక్కుంటే కొండవీటి సింహం. నల్లకోటు ధరిస్తే జస్టిస్‌ చౌదరి. కరాటే బెల్ట్‌ కట్టుకుంటే యుగ పురుషుడు. గాల్లోన ఎగిరితే సూపర్‌ మేన్‌.

ఒక మనిషి ఇన్ని చేయడం అసాధ్యం. కాని ఊహల్లో అయినా సామాన్యుణ్ణి లార్జర్‌ దేన్‌ లైఫ్‌గా ఉంచగలిగిన సమ్మోహితుడు ఎన్‌.టి.ఆర్‌. ఎనర్జీస్‌ని పాజిటివ్‌గా డ్రైవ్‌ చేసిన ఫోర్స్‌ అతడు. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకును జడను చుట్టి... పల్లె పాట అతడి పెదాల మీద పరవశించింది. కోలో కోయన్న కోలో నా సామీ... తెలుగు పదం అతడి పాద నర్తనలో మురిసిపోయింది. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అతడు హితవు చెప్పాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటూ ఈ దేశం వైపు సగర్వంగా కన్నెత్తి చూడమని పిలుపు ఇచ్చాడు. ఒక చెల్లికి అన్న– ఒక తల్లికి కొడుకు– ఆపదలో ఉన్నవాడికి రక్షకుడు– ప్రజలకు నాయకుడు సంపూర్ణ కథానాయకుడు. ఎన్‌.టి.ఆర్‌ ఉంటాడు. అతడు ఆరని గండదీపం.
– కె

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top