Sakshi News home page

ఆరు రుచుల పుస్తకాలు...

Published Fri, Mar 20 2015 10:34 PM

Books in six flavors

ఉగాది ప్రత్యేకం
 
పదార్థానికే కాదు పుస్తకానికి కూడా ఒక రుచి ఉంటుంది. తీపి, కారం, వగరు, చేదు... జీవితంలోని ఈ రుచులన్నింటినీ పుస్తకాలు చూపిస్తాయి. అవి ఎదురైనప్పుడు వాటిని ఎలా స్వీకరించాలో ఎంతవరకు స్వీకరించాలో ఎలా తప్పుకుపోవాలో ఎలా వాటిని ఎదిరించి నిలవాలో సూచిస్తాయి. ఉగాదికీ సాహిత్యానికీ మధ్య ఉన్న బంధం రుతువుకూ చివురుకూ ఉన్న బంధం. తెలుగువారు ఉగాది రాగానే పూతతో పాటు పద్యాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. అసలు సిసలు తెలుగు సారస్వతాన్ని తలచుకుని గర్వపడతారు. ప్రహసనంగా మారిన వాటిని హాస్యమాడి పండగ పూట కాసింత వినోదిస్తారు. ఉగాది కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ పేజీల్లో అవన్నీ ఉన్నాయి. ఆరు రుచుల పేర్లు చెప్పగానే ఆ రుచికి తగ్గ పుస్తకాన్ని ఇక్కడ కొందరు రచయితలు పంచుకున్నారు. పాప్యులర్ రచయితలు వారికి నచ్చిన ఆరు పుస్తకాలను ఎంచి చూపారు. పండగపూట ఇవన్నీ తేలికపాటి ఆరగింపులు. చిరు జలదరింపులు. చిత్తగించండి.
 
 తీపి మోహనవంశీ...

సాహిత్యంలో తీపి అంటే నాకు లత రాసిన ‘మోహనవంశీ’యే గుర్తుకు వస్తుంది. లత వాక్యం, రచనను ఆమె నిర్వహించే తీరు అద్భుతం. అంత తీయగా ఎవరైనా రాయగలరా?  తియ్యటి పాయసంలాంటి ప్రేమ మాధుర్యాన్ని వొంపి, జీవన మధువునంతా నింపి ఆమె ఆ రచన చేసిందా అనిపిస్తుంది. జీవితంలోని అన్ని ప్రశ్నలకూ తాత్విక సమాధానం తీయని వలపులో ఉందని చెప్పడానికే లత ఈ మధుర కావ్యం రాసి ఉండవచ్చు. ఈ నవలలోని రాధకానీ, ఆమె ప్రేమకానీ ఒక ఊహే కావచ్చు. కృష్ణుడిని దైవత్వ పీఠం నుంచి తొలగించి రాధ మనోవేదిక మీద ఒక ప్రేమికుడిగా కూర్చోబెట్టడమూ ఊహే కావచ్చు. కాని, ఆ ఊహలోని తియ్యదనం మాత్రం నిజం. ప్రేమ గురించి ఉమర్ ఖయ్యాం మొదలు ఎందరు కవులు చెప్పినా ఆ పాటలన్నీ అందమైన వచనంలోకి మారింది మాత్రం లత మోహనవంశీలోనే. అందుకే ఆమె లత. తెలుగు లత.
 - కల్పనా రెంటాల, రచయిత్రి
 
 చేదు  మహాప్రస్థానం

జీవితంలోనూ సాహిత్యంలోనూ చేదునిజాన్ని చెప్పిన కవిత్వం ‘మహాప్రస్థానం’. ఇంతటి చేదును ఇంతకు మునుపు ఎవరైనా చూశారా? ఎలాంటి చేదు ఇది? కడుపులో చేతులు పెట్టి దేవినట్టు అనిపించే చేదు. అంతవరకూ కవిత్వం అంటే కమనీయంగా రమణీయంగా ఉండాలని అనుకుంటూ ఉన్న నాకు ఈ పుస్తకం ఉలిక్కిపడేలా చేసింది. ‘చేదువిషం జీవఫలం’ అంటూ భయోద్విగ్నంగా జాగృతం చేసింది. ఆకలేసి కేకలేసే అభాగ్యులను, పతితులను, బాధాసర్పదష్టులను విముక్తంచేయమని పిలుపునిచ్చిన ఆ కవిత్వాన్ని ప్రతి ఒక్కరూ నాలుక మీద చేదుగా రాసుకోవాలి. అప్పుడే సత్యం పలకడం సాధ్యమవుతుంది. తాంబూల సేవనంలో ఉన్న కవిత్వాన్ని వేపమండలతో చరిచి మేల్కొల్పిన శ్రీశ్రీ ధన్యుడు.
 - సింగమనేని నారాయణ, కథా రచయిత
 
కారం  ఖాకీవనం

కారం అనగానే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పతంజలి వచనం. అది ఒక్కోసారి మామిడికాయ ముక్కకి అద్దినట్టుగా ఉంటుంది. మరోసారి పుండు మీద జల్లినట్టుగా ఉంటుంది. ఇంకోసారి కళ్లలో కొట్టినట్టుగా ఉంటుంది. పతంజలి ప్రతి రచనా ఒక రకం కారమే. ‘దిక్కుమాలిన కాలేజీ’లో ఆగ్రహానికి ఒక ఈస్థటికల్ పవర్ కనిపిస్తుంది. ‘ఖాకీవనం’లో కనిపించేది ఆగ్రహ వ్యాకరణం. ‘పతంజలి భాష్యం’లో కనిపించేది కోప కారణం. అయితే ఈ వ్యవస్థ మీదా వ్యక్తుల మీదా ఈ రాజ్యం మీదా మళ్లీ మళ్లీ కోపం తెచ్చుకోవాలంటే మాత్రం ‘ఖాకీవనం’లోకి వెళ్లిపోతాను. కోపాన్ని ఎన్ని ప్రతీకల్లో ఎంత దూరం చెప్పవచ్చో తనని తాను పరీక్షించుకోడానికి ఆయన ఈ నవల రాశారా అనిపిస్తుంది. అప్పటి దాకా మన సాహిత్యంలో కోప వ్యాకరణం లేదని కాదు. చాలా ఉంది. శ్రీపాద నుంచి చలం దాకా దూర్జటి నుంచి దిగంబర కవుల దాకా... కాని కోపాన్ని కోపంగానే పొగరు గానే వ్యక్తం చేయాలి అనుకొని దానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసినవాడు మాత్రం పతంజలి.
 - అఫ్సర్, కవి
 
 వగరు  పితృవనం


వగరు... ఈ రుచి అనగానే నాకు కాటూరి విజయసారథి గుర్తుకు వస్తారు. ఆయన నవల ‘పితృవనం’ తెలుగులో చాలా మంచి నవల నా దృష్టిలో. ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ఎవరైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు. బ్రాహ్మణుల శవాలను మోసే ఒక నిరుపేద బ్రాహ్మణుడి కథ అది. ఆ రోజుల్లోనే పదివేల రూపాయల బహుమతి గెలుచుకుంది. విజయసారథి చాలా జోవియెల్. బాగా నవ్వించేవాడు. కర్నూలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడానికి వచ్చినప్పుడు మంచి స్నేహితుడయ్యాడు. ‘నేనూ చీకటి’ నవలను అచ్చుకు పంపకముందు కొంత చదివి వినిపిస్తే చాలా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ‘నేనూ చీకటి’... ఆంధ్రప్రభలో సీరియలైజ్ అవుతున్నదని ఉత్తరం రాశాను. జవాబు లేదు. రెండు నెలల తర్వాత వాళ్లబ్బాయి సమాధానం రాశాడు- మీకు రిప్లై ఇవ్వడానికి నాన్న లేరు... చనిపోయారు అని. ఎందుకనో ఇది జరిగి చాలారోజులైనా కరక్కాయ కొరికినట్టుగా... ఇంకా గొంతు దిగనట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
 -కాశీభట్ల వేణుగోపాల్, నవలా రచయిత
 
పులుపు  కన్యాశుల్కం...

గట్టి పులుపు తగిలితే ఒళ్లు జిల్లుమంటుంది. జలదరిస్తుంది. ఒక్క మధురవాణికి తప్ప అలాంటి పులుపు, జలదరింపు తక్కిన తన అన్ని పాత్రలకూ ఇచ్చాడు గురజాడ కన్యాశుల్కంలో. ఆలోచించి చూడండి అందులో పులుపు తగలని పాత్ర ఉందా? అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు, రామప్ప పంతులు,  గిరీశం, వెంకటేశం, కరకట శాస్త్రి, బుచ్చమ్మ... అందరికీ తగిలింది. ఇది యాసిడ్ దాడి లాంటిది కాదు. బుగ్గ మీద చిటికేసి చక్కదిద్దడం. దారికి తేవడం. గురజాడ ఆత్మ మధురవాణిలోనే ఉందంటారు చాలామంది. నండూరి రామమోహనరావుగారు తనకే గనక అధికారం ఉంటే విజయనగరంలో మధురవాణి విగ్రహం పెడతానని అనేవారు. తమిళులు ‘కన్నగి’ పాత్రను అలా చెన్నై మెరీనా బీచ్‌లో ప్రతిష్టించుకున్నారు. మనం ఆ పని చేయలేదు. ఏ విషయం గురించైనా అసలు మనకు పులుపు తగిలితే కదా.
 - శ్రీరమణ, రచయిత
 
ఉప్పు  యమకూపం

ఉప్పు చాలా ముఖ్యమైన రుచి. సమతూకం పాటించాల్సిన రుచి. జీవితంలో దీనిని శృంగారంతో పోల్చవచ్చు. అది ఎక్కువైనా కష్టమే. అసలు లేకపోయినా నిస్సారమే. శృంగారంతో ముడిపడ్డ కుటుంబ వ్యవస్థ సజావుగా సాగాలంటే బయట వ్యభిచార వ్యవస్థ నడవక తప్పదు అని చాలామంది వాదిస్తారు. ఆ వ్యభిచార వ్యవస్థ విశ్వరూపాన్ని చూపించే నవల కుప్రిన్ రాసిన ‘యమకూపం’. చాలాఏళ్ల క్రితం చదివినా ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మన బయటి జీవితాల్లో ఉండే దొంతరలన్నింటినీ కుప్రిన్ ఒక వేశ్యావాటికలోని వీధిలో చూపించి మనల్ని ఆలోచింపచేస్తాడు. వ్యభిచారం పోవాలి అని పైకి ఎంత అరచినా సాధ్యం కాదు. మూలాలు చూడాలి. ఈ ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత రెండో స్థానంలో నిలిచింది స్త్రీల వ్యాపారమేనట. ఎంత విషాదం. సోషల్ రిలవెన్స్ పోతే ఏ పుస్తకమైనా మూలబడుతుంది. యమకూపం అలా మూలపడాలని నేను కోరుకుంటాను. కాని మరో వందేళ్లకూ సాధ్యమయ్యేలా లేదు.
 - విమల, కవి

Advertisement

What’s your opinion

Advertisement