ఐటీఐలో శిక్షణ..ఉపాధికి నిచ్చెన | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో శిక్షణ..ఉపాధికి నిచ్చెన

May 1 2025 2:09 AM | Updated on May 1 2025 2:09 AM

ఐటీఐల

ఐటీఐలో శిక్షణ..ఉపాధికి నిచ్చెన

రాజంపేట టౌన్‌ : కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ ఓ వరమని చెప్పవచ్చు. ఐటీఐలో ఏ ట్రేడ్‌ కోర్సు పూర్తి చేసినా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే ప్రధానంగా రైల్వే, ఆర్టీసీ, విద్యుత్‌శాఖ వంటి ప్రభు త్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాల కల్పనలో ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. స్వయంగా కూడా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

జిల్లాలో 15 ఐటీఐలు..

అన్నమయ్య జిల్లాలో మొత్తం 15 ఐటీఐలు ఉన్నాయి. ఇందులో మూడు ప్రభుత్వ ఐటీఐలు కాగా 12 ప్రైవేట్‌ ఐటీఐలు ఉన్నాయి. రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లెలో ఒక్కొక్క ప్రభుత్వ ఐటీఐ ఉంది. ప్రైవేట్‌ ఐటీఐల విషయానికి వస్తే మదనపల్లెలో నాలుగు, రాయచోటిలో రెండు, రాజంపేట, రైల్వేకోడూరు, తంబళ్లపల్లె, పీలేరు, గుర్రంకొండ, వాయల్పాడులో ఒక్కో ప్రైవేట్‌ ఐటీఐ ఉంది.

మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు..

ఐటీఐలో ప్రధానమైన ట్రేడ్‌లలో ప్రవేశానికి టెన్త్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే టెన్త్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఐటీఐలో సీట్ల కేటాయింపు ఉంటుంది. టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారికి కోరుకున్న ఐటీఐ కేంద్రంలో, ట్రేడ్‌ ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది. టెన్త్‌లో కొంత మంది విద్యార్థులకు సమానమైన మార్కులు వచ్చినప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. గణితంలో కూడా సమానమైన మార్కులు వచ్చివుంటే సైన్స్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ గణితం, సైన్స్‌ రెండు పాఠ్యాంశాలలో సమానమైన మార్కులు వచ్చినప్పుడు పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకొని ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. రిజర్వేషన్ల కేటగిరిని కూడా పరిగణలోకి తీసుకొని సీట్లను భర్తీ చేస్తారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఐటీఐలో ఉత్తీర్ణులై అప్రెంటీస్‌ కూడా పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలను సులువుగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే విద్యు త్‌, రక్షణ, రైల్వే రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే విద్యార్థులు వారికి సంబంధించిన ట్రేడ్‌లలో మంచి నైపుణ్యం కలిగి ఉంటే స్వ యంగా కూడా ఉపాధి అవకాశాలను పొందవచ్చు.

నేరుగా పాలిటెక్నిక్‌లోకి ప్రవేశం

ఐటీఐలో రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ రెండవ సంవత్సరంలో ప్రవేశానికి అర్హులవుతారు. పాలిటెక్నిక్‌ చదవాలనుకునే విద్యార్థులు తొలుత నెలరోజుల వ్యవధిగల బ్రిడ్జి కోర్సు చేసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ట్రేడ్‌ల వారీగా బ్రాంచ్‌లు కేటాయింపు

ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన ట్రేడ్‌లను బట్టి పాలిటెక్నిక్‌లో బ్రాంచ్‌ల కేటాయింపు ఉంటుంది. ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌ కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో సీటు కేటాయిస్తారు. అలాగే ఫిట్టర్‌, టర్నర్‌ మెషినిస్టు, రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఎయిర్‌ కండీషన్‌ కోర్సు చేసిన వారికి మెకానికల్‌ బ్రాంచ్‌లో, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, రేడియో అండ్‌ టీవీ మెకానిక్‌ కోర్సు చేసిన వారికి ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌లో, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌ ఉత్తీర్ణులైన వారికి ఆటోమొబైల్‌ బ్రాంచ్‌లో సీటు కేటాయిస్తారు.

ఉజ్వల భవిష్యత్తు

వివిధ కారణాల రీత్యా ఉన్నత చదువులు చదివేందుకు వీలు కాని వారికి ఐటీఐ చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఐటీఐ కోర్సు పూర్తి చేసుక్ను వారికి తప్పక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ప్రతిభ గల విద్యార్థులకు ఐటీఐ పూర్తి చేసిన తరువాత ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాము. ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఐటీఐ ఓ వరం లాంటిది.

ఆర్‌.రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్‌, పారిశ్రామిక శిక్షణా సంస్థ

కోర్సు పూర్తికాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ప్రవేశాలకు మొదలైన దరఖాస్తుల

స్వీకరణ ప్రక్రియ

ఐటీఐలో శిక్షణ..ఉపాధికి నిచ్చెన1
1/1

ఐటీఐలో శిక్షణ..ఉపాధికి నిచ్చెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement