
ఎర్ర మట్టి అక్రమ తరలింపు
● చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు
● తండావాసుల ఫిర్యాదుతో వెలుగులోకి..
●
మట్టి తవ్వకానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. సర్వే నంబర్ 34లో ప్రభుత్వ భూమి ఉండడంతో కొందరికి అసైన్‌మెంటు పట్టాలు ఇచ్చాం, అందులో కొంత భాగం మిగులు భూమి కూడా ఉంది. దీంతో పాటు కొంత పట్టా భూములు కూడా ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిలోనా లేక పట్టా భూమిలో తవ్వారా అనే విషయాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్
పాన్‌గల్: మండలంలోని కిష్టాపూర్‌తండా సమీపంలోని సర్వే నంబర్ 34లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇష్టానుసారంగా ఎర్రమట్టిని తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మిషన్లు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకోవడంతో పాటు పర్యావరణానికి భంగం కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ రోడ్లను ధ్వంసం చేస్తుండడంపై మండల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో సోమవారం తండావాసులు జిల్లా మైనింగ్, ఎస్పీకి ఫిర్యాదు చే యడంతో అక్రమ మట్టి దందా వెలుగులోకి వ చ్చింది. తండావాసుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు మట్టి తవ్వే ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించి, వివరాలు సేకరించినట్లు సమాచారం.