
నేడు సామూహిక కోర్టు భవనానికి శంకుస్థాపన
వనపర్తి టౌన్: జిల్లా న్యాయస్థాపన సామూహిక భవనానికి ఆదివారం తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్చువల్‌గా, ఇతర న్యాయమూర్తులు అనిల్ జూకంటి, మాధవిలే ప్రత్యక్షంగా శంకుస్థాపన చేయనున్నారని వనపర్తి బార్ అసిసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం న్యాయస్థానంలోని బార్ కౌన్సిలర్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 20 ఎకరాల్లో రూ.81 కోట్లతో మెడికల్ కళాశాల సమీపంలో ఈ భవనానికి భూమిపూజ చేస్తారని, ఇది వనపర్తి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. నూతన భవనాల వినియోగంలోకి వస్తే న్యాయ సేవలు ప్రజలకు ఒకే ఆవరణలో అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరు కావడంతో పాటుగా జిల్లాలోని న్యాయమూర్తులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు భరత్‌కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ప్రజావాణి రద్దు
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్‌సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తై, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీచేస్తూ గెలుపే లక్ష్యంగా సీపీఎం ఎన్నికల బరిలో ఉంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీఎస్ గోపి అన్నారు. మండల కేంద్రంలోని జీఎస్ భవన్‌లో శనివారం జరిగిన మండల సీపీఎం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజలు ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలపై ప్రశ్నించే సీపీఎం నాయకులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇస్తూ గెలిచిన అనంతరం కేవలం సంపాదనే లక్ష్యంగా భావిస్తున్న బూర్జువా పార్టీలకు ఎన్నో పర్యాయాలు అవకాశం ఇచ్చి ప్రజలు విసిగి పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. సమావేశంలో వెంకటేష్, అజయ్, రమేష్, రాఘవేంద్ర, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వసంతోత్సవంతో ముగిసిన దేవి శరన్నవరాత్రులు
కొత్తకోట రూరల్: పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో 11 రోజులుగా దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం వసంతోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై పట్టణ పురవీధుల గుండా మేళతాళాలు బాజాభజంత్రీలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. కర్ణాటకకు చెందిన కళాకారుడు వీరనాట్యం ప్రదర్శించారు. వారు ఖడ్గాలు, వీరడోలు ధరించి నిప్పులు చెరిగే మంటల నడున ఇనుప చువ్వలతో నిమ్మకాయలు, కొబ్బరికాయలను చిదిమేస్తూ చేసిన నృత్యాన్ని భక్తులు తిలకించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు భీమా చంద్రకాంత్, గౌరవ అధ్యక్షుడు భీమా ప్రభాకర్, శ్రీనివాసులు, నాగరాజు, శంకర్, సత్యం, విజయ్, పట్టణ అధ్యక్షురాలు జయలక్ష్మి, రాధిక, భారతి, జ్యోతి, అనిత, స్వర్ణలత, మంజుల, శైలజ తదితరులు ఉన్నారు.

నేడు సామూహిక కోర్టు భవనానికి శంకుస్థాపన