
ప్రిసైడింగ్ అధికారుల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పీఓ, ఏపీఓలకు అక్టోబర్ 6న నిర్వహించనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమంపై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సరైనా శిక్షణ గదులు, మైక్ సిస్టం, పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పీఓలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నిబంధనలు అవగాహన చేసుకొని సన్నద్ధత కావాల్సి ఉంటుందన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలని, నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణకు వచ్చే పీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏం జరిగినా పీఓలదే బాధ్యత అని, జాగ్రత్తగా వ్యవహారించాలని వారికి తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డీఈఓ అబ్దుల్‌ఘని, ఏఓ భాను, అధికారులు తదితరులు పాల్గొన్నారు.