
‘చట్టాలు ఎవ్వరికీ చుట్టాలు కావు’
అమరచింత: చట్టాలు ఎవరికీ చుట్టాలు కావని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించేందుకే చట్టాలు అమలు చేస్తున్నారని ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని పాంరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. సమాజంలో వయోవృద్ధులపై సానుభూతి చూపాలని, వారి సంక్షేమం కోసం కుటుంబ సభ్యులు పాటుపడాలని కోరారు. 18 ఏళ్ల లోపు బాల బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. చట్టాన్ని కాదని మైనర్లు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్షను తల్లిదండ్రులకు విధిస్తారని హెచ్చరించారు. బాల్య వివాహలతో కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. 14 ఏళ్ల వయస్సు గల వారిని పనిలో పెట్టుకోవడం నేరమని, నిబంధనలు ఉల్లఘిస్తే యజమానులకు జైలు శిక్షతో పాటు జరిమానాలు ఉంటాయన్నారు. ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు తిప్పారెడ్డి, గంగాధర్‌గౌడ్, జీకే రాములు, అశోక్‌కుమార్, ముక్తేశ్వర్, రాంచందర్, ఎస్‌ఐ స్వాతి తదితరులు పాల్గొన్నారు.