
వైభవం.. వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి గుట్టపైనున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆశ్వజ మాసం శుక్లపక్షం దశమి సందర్భంగా గురువారం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణం జరిపించారు. పండితులు తలంబ్రాలు పోయగా.. ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ వేడుకను తిలకించడానికి పరిసర గ్రామాల భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరా ఆచార్యులుతో పాటు నిర్వాహకులు వేముల శ్రీనివాస్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, శ్రీనివాసులుశెట్టి, జగదీశ్వర్‌రెడ్డి, తిరుపతయ్య, భాస్కర్, రాంబాబు, రాములుయాదవ్, ప్రశాంత్‌రెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, రమేష్ బాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.