
వేడుకగా విజయదశమి
వనపర్తి
● జిల్లాకేంద్రంలో బేతాళుడి సంరక్షణలో ఆయుధాలతో ఊరేగింపుగా వచ్చిన రాజా కృష్ణదేవరావు
● శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వనపర్తిటౌన్: జిల్లాలో గురువారం విజయదశమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమగా జరుపుకొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గురువారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవి, అపరాజితదేవిగా ఆరాధించారు. శమీ పూజకు ముందు, అనంతరం ఆలయాలు, మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహికంగా భజనలు చేస్తూ మేళతాళాల నడుమ ఊరేగింపుగా శమీ వృక్షాల వద్దకు చేరి పూజలు నిర్వహించి ఒకరికొకరు జమ్మి పంచుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడం కనిపించింది. పండుగ రోజు మధ్యాహ్నం వరకు పూజ సామగ్రి, పూలు, పండ్లు, నిత్యావసరాల సరుకుల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి.
జిల్లాకేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా..
వనపర్తి సంస్థానాధీశుల వారుసుడు రాజా కృష్ణాదేవరావు రాజ భవనంలో దుర్గాదేవికి.. అర్చకులు నాటి రాజవంశీయుల ఆయుధాలకు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం పారాయణంతో ముగించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పలువులు మాజీ ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దేవుడి విగ్రహాన్ని పల్లకీలో, విశ్వ బ్రహ్మణులు తయారు చేసిన బేతాళుడి విగ్రహం సంరక్షణలో నాటి ఆయుధాలను కలవృత్తుల పెద్దల సమక్షంలో మేళతాళాలు, బాణాసంచ పేలుళ్ల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగింపుగా నల్లచెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై ఉన్న శమీ వృక్షం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజలు జరిపించి జమ్మిని ప్రజలకు అందజేశారు. ఈ వేడుకకు పట్టణ ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పాతబజార్‌లోని మసీద్ సమీపంలో ఎండీ అనిస్ ఆధ్వర్యంలో ముస్లింలు రాజా వంశీయులకు స్వాగతం పలికే ఆచారాన్ని కొనసాగిస్తూ హిందూ ముస్లింలు పండు గ శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యతను చాటారు. ట్యాంక్‌బండ్‌పై రాత్రి 10 గంటల వరకు ప్రజలు కు టుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు.
బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. టపాసులతో రూపొందించిన రావణుడిని దహనం చేయగా చూసేందుకు పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.

వేడుకగా విజయదశమి

వేడుకగా విజయదశమి