క్రీడా మైదానం.. నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

క్రీడా మైదానం.. నిరుపయోగం

Oct 1 2025 11:25 AM | Updated on Oct 1 2025 11:25 AM

క్రీడా మైదానం.. నిరుపయోగం

క్రీడా మైదానం.. నిరుపయోగం

కనిపించని క్రీడాసామగ్రి

బీఆర్‌ఎస్‌ పాలనలో ఆగమేఘాల మీద ఏర్పాటు

నీరుగారుతున్న లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం

నిరుత్సాహంలో యువత, విద్యార్థులు

అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు జీవం పోయడంతో పాటు పల్లె క్రీడాకారుల నైపుణ్యాలను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో క్రీడా మైదానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం స్థలం కేటాయించడంతో పాటు రూ.5 లక్షలు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. కాని చాలా గ్రామాల్లో క్రీడా మైదానాలు గ్రామాలకు దూరంగా గుట్టల ప్రదేశాల్లో ఉండటంతో నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో పాఠశాల మైదానాల్లో ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు కాస్త ఉపయోగంగా ఉన్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న క్రీడా మైదానాల నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. రాళ్లు రప్పలు తేలిన ప్రదేశాల్లో వీటికి సంబంధించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఆ ప్రాంతాల్లో ఆటలు ఎలా ఆడుతారనే సంగతే మరిచారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఉన్న క్రీడా మైదానాల పరిస్థితి ఇదేవిధంగా ఉండటంతో ప్రస్తుతం ప్రభుత్వమైనా వీటిని వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ క్రీడా మైదానాల్లో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో కోర్టులను ఏర్పాటుచేసి వీటికి సంబంధించిన సామగ్రిని బిగించగా.. ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. క్రీడాకారుల కోసం అన్నిరకాల క్రీడాసామగ్రి కిట్‌ను ఆయా గ్రామపంచాయతీలకు అప్పగించారు. అవి సైతం ఎక్కడా కనిపించడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం.. స్థల దాతలు ముందుకురాకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేదు.

పిచ్చి మొక్కలు, చెత్త చెదారం..

నిర్వహణ లేకపోవడంతో క్రీడా మైదానాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు చెత్తా చెదారంతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు సైతం కనిపించడం లేదు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేయకపోవడంతో క్రీడాకారులు వీటిని వినియోగించుకునే పరిస్థితి లేక నిరుపయోగంగా మారాయి.

వినియోగంలోకి తీసుకొస్తాం..

గ్రామాల్లోని క్రీడా మైదానాల్లో సామగ్రి సమకూరుస్తాం. క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం. కొన్ని గ్రామాల్లో వసతులు లేవని తెలిసింది. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి క్రీడాకారులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.

– రఘునాథ్‌రెడ్డి, ఇంచార్జి డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement