
రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్రని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి వారి బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, అక్టోబర్ 9న మొదటి విడత, అక్టోబర్ 13న రెండోవిడత ఎన్నికల ప్రకటన విడుదల చేసే బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అన్నారు. ఎన్నికల ప్రకటనను ఆర్‌ఓ కార్యాలయం, కలెక్టరేట్ నోటీసుబోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియను వీడియో తీయాలని, పత్రంలో అభ్యర్థి ఏమైనా తప్పులు చేసినా, సంతకాలు లేకున్నా, తగిన ధ్రువపత్రాలు జత చేయకున్నా గుర్తించి సరి చేయించాలని, సాధ్యమైనంత వరకు తిరస్కరించకుండా చూడాలని ఆదేశించారు. ఏదైనా ధ్రువపత్రం జతచేయని పక్షంలో నిర్దిష్ట సమయంలో అభ్యర్థికి నోటీస్ జారీ చేయాలని, సకాలంలో ధ్రువీకరణ పత్రం సమర్పించని పక్షంలో మాత్రమే తిరస్కరించాలని ఆదేశించారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థి వెంట గదిలోకి ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని వివరించారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు బి–ఫారం ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే కేటాయించి స్వతంత్ర అభ్యర్థులకు అభ్యర్థి పేరు తెలుగు అక్షరాలకు అనుగుణంగా కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రతి పేజీని చదువుకొని అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నోడల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఎన్నికల నియమావళి ప్రకారం నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ప్రతి అధికారి కి బాధ్యతలపై అవగాహన కల్పించి అప్పగించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి