
ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు సఫలీకృతం కావాలని, దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ఎస్పీ, ఆయన సతీమణి అపర్ణ, అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ఎలాంటి ఆటంకం, అవరోధం కలగకుండా ఉండాలని బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దుర్గామాత కరుణా కటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, రిజర్వ్ ఎస్‌ఐలు వినోద్, సురేందర్, మొగ్దుంబారి, జిల్లాలోని ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.