
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మ అని.. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఇలాంటి వేడుకలు సాంప్రదాయాలను కాపాడటమే కాకుండా కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఎస్పీ, ఆయన సతీమణి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణతో కలిసి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎక్కడైనా దేవుళ్లకు పూలతో కొలుస్తామని.. కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషం కలిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బంది, మహిళ అధికారులు, వారి కుటుంబసభ్యులతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకేచోట చేర్చి ఆడిపాడుతూ సందడి చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, మహిళా ఎస్‌ఐలు స్వాతి, రాణి, రజిత, దివ్య. హిమబిందు, మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ