
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని.. 24, 48, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనుండగా.. మొదటి విడతలో 8 జడ్పీటీసీలు, 71 ఎంపీటీసీలు, రెండోవిడతలో 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు సైతం రెండు విడతల్లో నిర్వహించనుండగా.. మొదటి విడతలో 135, రెండోవిడతలో 133 గ్రామపంచాయతీల్లో జరుగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, నోడల్ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.