
యువత మత్తుబారిన పడొద్దు
వనపర్తి: జిల్లా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే చెడు ప్రభావాలపై గ్రామాలు, విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో పోలీసు, ఎకై ్సజ్ తదితర అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలు, కల్లు దుకాణాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనుమానితులు, వాహనాలపై నిఘా ఉంచామని, పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.