
పండుగపూట పస్తులేనా..
జీపీ కార్మికులకు మూడు నెలలుగా అందని వేతనాలు
●
కుటుంబ పోషణ భారమైంది..
నెలనెలా వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రతినెలా వంట సరుకుల కోసం చేసిన అప్పులను సైతం తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిత్యం తమతో పనులు చేయించుకుంటుందే తప్ప వేతనాలు మాత్రం సక్రమంగా అందించడం లేదు. పండుగ పూట సైతం పస్తులు ఉండక తప్పడం లేదు. – మల్లేష్,
పంచాయతీ కార్మికుడు, నాగల్‌కడ్మూర్
వేతనాల కోసం ఆందోళన..
పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వేతనాలను క్రమం తప్పకుండా చెల్లించాలంటూ కార్మికుల పక్షాన ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. సకాలంలో వేతనాలు ఇవ్వకుంటే సమ్మె చేపడతాం. – సి.రాజు,
టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు, మస్తీపురం
ఉన్నతాధికారులకు నివేదించాం..
జిల్లాలో పంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల గురించి ఉన్నాతాధికారులకు నివేదించాం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం నిధులను మంజూరుచేసిన వెంటనే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. – రఘునాథ్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీఓ
అమరచింత: గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచడంలో ముందుంటున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలనెలా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పండుగపూట పస్తులు తప్పడం లేదంటూ ఆవేదనకు గురవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలంటూ పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా కార్మికులు నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి వీరికి వేతన వెతలు అధికమయ్యాయి. ఇంటి పోషణ కోసం ప్రతినెలా అప్పులు చేస్తున్నామని.. వాటిని సకాలంలో తీర్చలేని కారణంగా మరోమారు అప్పులు సైతం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. ప్రతినెలా పంచాయతీ కార్మికుల బ్యాంకు ఖాతాలో నెల వేతనం జమ చేయాల్సి ఉండగా.. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో 1,200 మంది కార్మికులు..
జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులతో పాటు తాగునీటి సరఫరా తదితర పనులు చేస్తున్న కార్మికులు మొత్తం 1,200 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ. 9,500 చొప్పున గౌవర వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో ఆరు నెలలకో పర్యాయం కార్మికుల వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎస్‌టీఓలకు పంపించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో కార్మికులకు ప్రతినెలా వేతనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉపక్రమించింది. అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు వేతన తిప్పలు తప్పడం లేదు. గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్న వీరికి నెలనెలా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
ప్రతినెలా జీతం కోసం ఎదురుచూపులు
కుటుంబ పోషణ కోసం తప్పని అప్పులు
ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం శూన్యం

పండుగపూట పస్తులేనా..

పండుగపూట పస్తులేనా..

పండుగపూట పస్తులేనా..