
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
అచ్చంపేట రూరల్: రాష్ట్రాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం అచ్చంపేటలో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్ జనగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి.. 90 శాతం పనులు పూర్తిచేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒకవేళ ప్రాజెక్టులను పూర్తిచేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్ధేశంతోనే ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యాం నిరుపయోగంగా మారుతాయన్నారు. గతంలో రాజోలి బండ కోసం 2001లో కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు సుంకేసుల తూములను బాంబులతో పేలుస్తామన్న రాయలసీమ ఎమ్మెల్యేకు, వెయ్యి బాంబులతో మొత్తం బ్యారేజ్‌ను తునాతునకలు చేస్తామని కేసీఆర్ ధీటుగా బదులిచ్చారని గుర్తుచేశారు. అలాంటి దమ్ము, తెగువ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని జైపాల్‌రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌తో అచ్చంపేట నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీళ్లిచ్చిందన్న కేటీఆర్, మరో 70 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. అచ్చంపేట బిడ్డ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు.
హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డుతో బుద్ధి చెప్పాలి
స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొందపెట్టాలి
అసమర్థత వల్లే యూరియా కోసం క్యూలైన్లు మళ్లీ వచ్చాయి
అచ్చంపేట జనగర్జన బహిరంగ సభలో కేటీఆర్ వ్యాఖ్యలు