
యూరియా పంపిణీలో అవకతవకలతోనే ఇబ్బందులు
కొత్తకోట రూరల్: యూరియా పంపిణీ విధానంలో అవకతవకల కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతి కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కనిమెట్టలో బీజేపీ నాయకుడు రాజేందర్‌రెడ్డి నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతినెలా నాలుగో ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. దేశంలో జరిగే ఘటనలు, కొత్త విషయాలను ప్రధాని ప్రజలతో పంచుకోవడం విశేషమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వీక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని.. అయితే మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని అన్నారు. ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. యూరియాను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. పంపిణీ విధానంలోనే అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, దళితమోర్చా రాష్ట్ర నాయకులు రాసమోని సాయిరాం, కోటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చందు, తిరుపతి పాల్గొన్నారు.