
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
పాన్‌గల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పీహెచ్‌సీలో కొనసాగుతున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రత్యేక వైద్య శిభిరాల రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిభిరాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది చూడాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉండి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యుడు డా. చంద్రశేఖర్ పాల్గొన్నారు.