
పురం.. అభివృద్ధి పథం
పురపాలికల వారీగా ఇలా..
పురపాలిక వార్డులు జనాభా
(వేలల్లో..)
అమరచింత 10 15
ఆత్మకూర్ 10 18
కొత్తకోట 15 25
పెబ్బేరు 12 21
అమరచింత: జిల్లాలోని కొత్త పురపాలికలు ఒక్కోదానికి సీడీఎంఏ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు లేక నిలిచిన నిర్మాణాలతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎంతమేర డబ్బులు అవసరమవుతాయనే వివరాలతో పుర కమిషనర్లు అంచనాలు సిద్ధం చేసి మంత్రి వాకిటితో పాటు ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డికి అందించారు. వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పట్టుబట్టి నిధులు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. జిల్లాలోని కొత్త పురపాలికలైన అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరుకు ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేయించుకున్నారు. పుర ఎన్నికల ప్రకటన వెలువడక ముందే టెండర్లు పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత అధికారులు వార్డుల్లో చేపట్టాల్సిన పనుల కోసం వార్డు అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.
చేపట్టాల్సిన పనులు..
మంజూరైన నిధులతో డ్రెయినేజీలు (వరదనీరు పారేందుకు) నిర్మించనున్నారు. వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రహదారులు పూర్తి చేస్తారు. అదేవిధంగా అర్బన్ పార్క్‌లు అభివృద్ధి చేస్తూ జంక్షన్ల వద్ద సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు స్వచ్ఛత కోసం రహదారులకు ఇరువైపులా ఉన్న దెబ్బతిన్న మురుగు కాల్వలను నిర్మించాల్సి ఉంది. సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో పాటు టౌన్‌హాల్ నిర్మించాల్సి ఉందని పుర అధికారులు వివరించారు. పుర ఎన్నికల ప్రకటన వెలువడక ముందే చేపట్టాల్సిన పనులకు టెండర్లను ఆహ్వానించాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పనులు చేపట్టేందుకు అవకాశం ఉండకపోవడంతో వేగవంతంగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
కొత్త పురపాలికలకు సీడీఎంఏ నిధులు మంజూరు
ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు
డ్రెయినేజీలు, పార్క్‌లు, సీసీ రహదారుల నిర్మాణాలపై దృష్టి
ఎన్నికల ప్రకటనకు ముందే
టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారుల సన్నాహాలు
గుర్తించిన పనులకే ప్రాధాన్యం..
పట్టణంలో ప్రజల భాగస్వామ్యంతో గుర్తించిన పనులకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పూర్తి చేయనున్నాం. పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, డ్రెయినేజీలు, సీసీ రహదారులు నిర్మించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. – నాగరాజు, పుర కమిషనర్, అమరచింత

పురం.. అభివృద్ధి పథం