
బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
వనపర్తి: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో శనివారం ఉదయం జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు పోరాడిన మహనీయులను తెలంగాణ సమాజం ఎప్పటికీ స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర ఆయనకు ఉందని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు పరితపించిన ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ప్రజాప్రతినిధులు రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు, సామాజికవేత్త రాజారాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.