
‘బీసీ రిజర్వేషన్లు సాహసోపేత నిర్ణయం’
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడం అభినందనీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన బీసీ వ్యతిరేకవాదులు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సహకరించకుండా అడ్డుకుంటున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేసినా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ బీసీలకు 42 శాతం కేటాయించినట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు సంఘటితంగా ఉండాలని.. కొందరు దుర్మార్గులు చేస్తున్న కుట్రలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్‌గౌడ్, పెబ్బేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, పార్టీ మండల అధ్యక్షుడు రవికిరణ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.