
ఏళ్లుగా నిలిచిన డిస్పెన్సరీ సేవలు
ఆస్పత్రి అందుబాటులోకి వస్తే..
● వైద్య సేవలకు దూరమవుతున్న కార్మికులు
● దశాబ్దాలుగా హామీలకే
పరిమితమైన వైనం
● పాలకులు, అధికారులు దృష్టిసారిస్తే మేలు
వనపర్తిటౌన్: కార్మికులకు ఉచితంగా వైద్యసేవలు అందించే ఈఎస్‌ఐ ఏర్పాటు హామీ ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ఆరోగ్య సేవల నిమిత్తం వేతనం నుంచి నిర్దిష్ట రుసుంను పురపాలిక, బీడీ, ఇతర కార్మికుల వేతనాల నుంచి ప్రతినెల కోత విధిస్తారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారినపడితే ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు ఏళ్లుగా పాలకుల హామీగానే మిగిలిపోతున్న తరుణంలో తాజాగా నెల క్రితం ఎమ్మెల్యే మేఘారెడ్డి మంజూరు చేయిస్తామని ప్రకటించడంతో కార్మిక వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
డిస్పెన్సరీకే దిక్కులేదు..
గత కొన్నేళ్ల కిందట స్థానిక పుర కార్మికుల కోసం అప్పటి పాలకులు డిస్పెన్సరీని మంజూరు చేశారు. 2000 సంవత్సరం వరకు కార్మికులు డిస్పెన్సరీలోనే వైద్యసేవలు పొందారు. ఆ తర్వాత డిస్పెన్సరీ అనుమతి పొందిన ఆస్పత్రి యాజమాన్యం అనారోగ్యం రీత్యా అనుమతిని పునరుద్ధరించుకోకపోవడంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. అప్పటి పాలకులు, అధికారులు దృష్టి సారించకపోవడంతో నేటికీ కార్మికులు వైద్య సేవలకు దూరమవుతున్నారు. జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులున్నా.. డిస్పెన్సరీ సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో కార్మికుల ఆరోగ్య భద్రతపై నీలినీడలు అలుముకున్నాయి.
ఈఎస్‌ఐ కార్డులు అంతంతే..
కార్మికులకు ఈఎస్‌ఐ కార్డులు జారీ చేయడంలోనూ పుర అధికారులు, ఇతర రంగాల కార్మికుల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అవగాహన ఉన్న కార్మికులు మినహా మిగతా వారు ఈఎస్‌ఐ నంబర్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయని చెబుతున్నా వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై స్పష్టత కొరవడింది. పురపాలికలోని ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి తెలిసిన ఏజెన్సీకి ఈఎస్‌ఐ కన్సల్టెన్సీగా అవకాశం ఇచ్చినా.. ఆ ఏజెన్సీ అవసరమైన కార్మికులు ఫోన్‌చేస్తే తప్ప అధికారులతో సమన్వయం చేసుకొని కార్డుల జారీకి చొరవ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి.
బీడీ కార్మికులు
6 వేలు
ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటించినట్లుగా జిల్లాకు ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరైతే అన్నిరంగాల కార్మికులకు మేలు చేకూరనుంది. సాధారణ వైద్యసేవల నుంచి మొదలు శస్త్ర, వైకల్య చికిత్సలు సైతం ఇక్కడే అందనున్నాయి. దీంతో కార్మికులకు దూరభారం, రవాణా ఖర్చులు, వ్యయ ప్రయాసలు తప్పుతాయి. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో పాటు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి కార్మిక, వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రి ఏర్పాటుకు భవన పరిశీలన చేపడితేనే అప్పుడు అడుగులు పడినట్లు అవుతుంది. ప్రస్తుతానికి సాధారణ వైద్యసేవలకు డిస్పెన్సరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

ఏళ్లుగా నిలిచిన డిస్పెన్సరీ సేవలు