
అమ్మాయి చదువు కుటుంబానికి వెలుగు
● మహిళల అభివృద్ధికి పాటుపడాలి
● సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి,
ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి: ఇంట్లో అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని.. బాల్య వివాహాలను అరికట్టి మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ‘మన కోసం.. మన పిల్లల కోసం‘ అనే నినాదంతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా యూనిసెఫ్ సహకారంతో సెర్ప్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్నేహ (సేఫ్టీ న్యూట్రిషన్ ఎంపవర్‌మెంట్ హెల్త్ అడోలెసెన్స్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. బాల్య వివాహాన్ని నిర్వహించిన కుటుంబసభ్యులే కాకుండా ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులని చెప్పారు. అదేవిధంగా బాలికలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ బారినపడి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. సమాజ గతిని మార్చే శక్తి సెర్ప్ వారిదని, సభ్యులు స్వయం సహాయక బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్నేహ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐలు అన్ని మండలాల్లో సమన్వయంతో పనిచేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తద్వారా జిల్లాలో బాల్య వివాహాలు, పోక్సో కేసులు నివారించగలమన్నారు. ఈ సందర్భంగా పొక్సో కేసుపై అవగాహన కల్పించేందుకు పోలీస్‌శాఖ నిర్వహించిన స్కిట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, డీఆర్డీఓ ఉమాదేవి, డీడబ్ల్యూఓ సుధారాణి, డీఐఈఓ ఎర్ర అంజయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, సెర్ప్ సిబ్బంది, పోలీసుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.