
సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు
● రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్
వనపర్తి: రవాణా, లేబర్ ఛార్జీలు పెంచాలంటూ మన ఇసుక వాహన ట్రాక్టర్ల యజమానులు అర్ధాంతరంగా ఇసుక రవాణాను నిలిపివేశారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మన ఇసుక వాహనం ట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు జిల్లాల కంటే ఈ జిల్లాలో కిలోమీటరుకు రవాణా ఛార్జీ ఎక్కువగానే చెల్లిస్తున్నామని.. అయినప్పటికీ ఇంకా పెంచాలని రవాణా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలో కిలోమీటర్‌కు రూ.70 ఉంటే.. ఇక్కడ రూ.80 చెల్లిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. ఇసుక లేకుంటే ఎలా పూర్తవుతాయని, లబ్ధిదారులకు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. వెంటనే ఇసుక రవాణా ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండటంతో ఇసుక రీచ్‌లలో దొరకడం లేదని, లోపలికి వెళ్తే ట్రాక్టర్ బయటికి రావడం కష్టమవుతుందన్నారు. ఇసుక లోడింగ్‌కు లేబర్ ఛార్జీ ప్రభుత్వం రూ.350 ఇస్తుండగా.. తాము రూ.500 ఇవ్వనిదే ఎవరూ రావడం లేదని వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని.. ఇసుక రవాణా మాత్రం వెంటనే ప్రారంభించాలన్నారు. అందుకు అసోసియేషన్ సభ్యులు సమ్మతించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ గోవిందరాజులు, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ పాల్గొన్నారు.