
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని.. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నివర్గాల హక్కుల సాధనకు పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటితరానికి స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్దీన్‌ఖాన్, సామాజికవేత్త రాజారాంప్రకాష్, రజక సంఘం జిల్లా నాయకుడు బండలయ్య, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్, రాజు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.